థర్మల్ పవర్​ప్లాంట్​లకు సరిపడా బొగ్గు రవాణా చేయాలి : సీఎండీ ఎన్.బలరామ్

థర్మల్ పవర్​ప్లాంట్​లకు సరిపడా బొగ్గు రవాణా చేయాలి : సీఎండీ ఎన్.బలరామ్
  • అన్ని ఏరియాల జీఎంలకు  సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశం

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని, థర్మల్ ప్లాంట్ల డిమాండ్ మేరకు బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచాలని  సింగరేణి సీఎండీ బలరామ్ ఆదేశించారు.  మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సీఎండీ మాట్లాడుతూ.. సింగరేణితో ఇంధన ఒప్పందం ఉన్న అన్ని విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గును రవాణా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అన్ని గనుల్లోనూ వేసవి జాగ్రత్తలను పాటించాలన్నారు. రానున్న మూడు నెలల్లోనూ విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నారు.

ఈ ఏడాది నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను ముందే చేరుకున్న కిష్టారం ఓసీ, పీకే ఓసీ-4, జీడీకే-5 ఓసీ, ఆర్జీ ఓసీ-2, ఆర్ కే -6 ఇంక్లైన్, ఆర్కే న్యూటెక్, ఎస్సార్పీ ఓసీ-2  గనుల అధికారులు, కార్మికులకు సీఎండీ బలరామ్ అభినందనలు తెలిపారు. కంపెనీ ఆస్తుల పరిరక్షణకు ఎస్టేట్స్, రక్షణ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆక్రమణలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కంపెనీలో పనిచేస్తున్న ప్రతీ ఉద్యోగి కూడా భోజన విరామం మినహా మిగిలిన 8 గంటల సమయాన్ని పూర్తి గా కంపెనీ ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కృషి చేసేలా అధికారులు చూడాలన్నారు. డ్యూటీల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్టీపీపీలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కార్బన్ డై యాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ ట్రయల్ రన్  సక్సెస్​ అవడం పట్ల సీఎండీ హర్షం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయిలో మిథనాల్ ఉత్పత్తి చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.